Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

పరాశక్తి స్వరూపం

మూకపంచశతిలోని స్తుతి శతకములో శ్రీ కామాక్షీదేవీ దేహవర్ణం నలుపుతో కలిసిన నీలిరంగు అని చెప్పబడినది. అదే గ్రంథములోని ఆర్యాశతకము అమ్మవారి దేహకాంతి కుంకుమచాయ యని పేర్కొన్నది, ఆచార్యపాదులవారు సౌందర్యలహరిలో అంబిక 'బాలాతపరుచిః' అని అరుణగా వర్ణించారు. ఐతే అమ్మవారి దేహచ్ఛాయనుగూర్చి ఈవైవిధమేల? దేవీమంత్రశాస్త్ర ప్రకారము కామేశ్వరుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులకుపైగా. నిష్క్రియుడుగానూ, నిస్సంగిగాను ఉంటున్నాడు. పరాశక్తియైన కామేశ్వరి కామేశ్వరుని వామభాగంలో ఎరుపురంగుతో ఉన్నది. పార్వతి నలుపూ, పరాశక్తి ఎరుపూ, మూకపంచశతి ఈరెంటినీ కలిపి పరాశక్తి వర్ణములను శ్యామారుణములని చెప్పినది.

కామేశ్వరుని రంగు స్ఫాటిక శిలావర్ణము. స్ఫటికము నీళ్ళలో మునిగి ఉన్నప్పుడు అది ఉన్నదనికూడా తెలియదు. అందుచే ఆయనకు రూపమున్నా రూపము లేనివాడుగా భావింపబడుతున్నాడు. విష్ణువూ, పార్వతీ నలుపు కలిసిన నీలివర్ణముతోడివారు. శివుడూ, సరస్వతీ తెల్లనివారు. బ్రహ్మ, లక్ష్మి బంగారుపసిమి వర్ణమువారు. పగటికి ఏవర్ణము లేకపోయినా, అందులో అన్ని వర్ణములూ కలిసియున్నవి. ఇందులో ఏ ఒక్కరంగునైనా వేరుచేసినామంటే తక్కిన రంగులున్నూ వ్యక్తమవుతవి. ఈరంగులో ఎరుపు సౌమ్యమైనది. ఛాయాగ్రాహక చిత్రాలలో నెగిటివ్స్‌ తయారుచేయడానికి ఎఱుపుడాలుఉపయోగిస్తారు. అరుణారుణ ఐన పరాశక్తి ప్రభావంలో వర్ణరహితుడైన సదాశివుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఆవిర్భవించి, సరస్వతీ లక్ష్మీ, పార్వతులతో సపత్నీకుడై, జగద్వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాడు.

జాగ్రత్స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలున్నూ, సృష్టి స్థితి లయములున్నూ ఉన్నట్టే, ఈ ముగ్గురు మూర్తులూ ఉన్నారు. జాగ్రత్స్వప్నములు సుఖదుఃఖమిశ్రములు. సుషుప్తిలో ప్రాపంచికదుఃఖము లేదు. సుషుప్త్యవస్థకు పైది తురియస్థితి అది పరమానందభూమి. పుణ్యపాపములనుండి. జన్మమృత్యు చక్రమునుండి జీవులకు ప్రళయము విరామమిస్తూ ఉంటుంది. శివుడు సంహారకుడైనా జీవులకు వలసిన విశ్రాంతికూడా ఇస్తున్నాడు. సౌందర్యలహరిలో భగవత్పాదులవారు పరాశక్తి తన కనురెప్పలుమూసి తెరచేటంతలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్ఠిస్థితి లయ కార్యాలను చేస్తున్నారని చమత్కరించినారు. ఆమె సమక్షంలో ఈ కార్యాలు పరంపరగా సాగిపోతున్న వన్నమాట.

జగత్సూతే ధాతాహరి రవతి రుద్రః క్షపయతే

తిరస్కుర్వన్నేత త్స్వమపి వపురీశ స్థిరయతి |

సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ

స్తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్ర్భూలతికయోః ||

ఒకే పరమాత్మ వివిధ రూపాలతో కరుణామూర్తియై తన దయాధారను మనపై పరపుతున్నాడని దీనివల్ల మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా కోరుకుంటే అదేవిధంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనం మంత్రజపం చేస్తున్నాము. అవి శబ్ద తరంగాలను ఉత్పన్నం చేస్తున్నాయి. ఆ తరంగాలే మంత్రమూర్తులుగా మారుతున్నాయి. మనం వదలకుండా అవిరామంగా మన కుపదేశించిన మంత్రాన్ని జపంచేస్తూ వచ్చినామంటే ఆ పరాశక్తి అనుగ్రహం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. చంద్రమండలాంతర్గతంగా ఆమెను ధ్యానిస్తే ఆ పరదేవత కాంతినీ, శాంతినీ ఇస్తుంది. తాపత్రయాలనూ పోగొట్టుతుంది. ఆమె తన అమృత కిరణాలను మనపై ప్రసరింపజేస్తుంది. మనం ఆరాధించే ఆ పరదేవతా, పౌర్ణమాస్యనాడు ఆకాశంలో చూచే చంద్రుడై, మన జీవితంతో సంబంధము కలవారే. అందుచేత మనం మన ఇష్టదేవత నుద్దేశించి మంత్రోపదేశం పొంది ఆ మంత్రజపం అవిరామంగా చేస్తూ, వచ్చినామంటే ఆ మంత్ర దేవత మనలను ఆవహించి కళేబరాన్ని త్యజించే సమయంలో కూడా వదిలిపెట్టదు. మనం ఆ దేవతాధ్యానంలోనే ఉండి పోగలము. ఇది మహరులు ఉపదేశించినమార్గం. ఆ మార్గాన్నే శ్రేయోభిలాషులమైన మనమూ అనుగమించాలి.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page